రాజధాని లేకున్నా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మాత్రం భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. 2016-17 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రతిపాదించేందుకు ఏపీ సర్కారు సమాయత్తమవుతున్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ కు సంబంధించి సీఎం చంద్రబాబు సూచనల మేరకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పివి రమేష్ తదితరులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో దాదాపు రూ. 1,32,000 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక బడ్జెట్ లో వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఐటి, స్వయం ఉపాధి తదితర అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు. బడ్జెట్ మొత్తం 2015-16కంటే 19 వేల కోట్ల రూపాయలు అధికంగా ఉంటుందని స్పష్టమవుతోంది. గతేడాది ఏ శాఖ సమర్థవంతంగా నిధులను ఉపయోగించిందో నిర్ణయించి, ఆయా శాఖలను ప్రోత్సహించాలని సర్కారు భావిస్తోంది. వ్యవసాయం అనుబంధ రంగాలకు 18 వేల కోట్ల రూపాయలపైగా కేటాయిస్తారని సమాచారం. దీంతో పాటు నీటి పారుదల రంగానికి ఎనిమిది వేల కోట్లు కేటాయించవచ్చని తెలుస్తోంది. విద్యారంగానికి 20 వేల కోట్లు, వైద్య ఆరోగ్య రంగానికి ఆరువేల కోట్లు, తాగునీటి అవసరాలకు 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తారని తెలుస్తోంది. ప్రజలపై ప్రత్యక్షంగా ఎలాంటి పన్నులు వేయకుండానే… రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో లభించే నిధులు ఎక్కువ మొత్తంలో ఉండేలా ప్రయత్నిస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి