4, ఏప్రిల్ 2016, సోమవారం

నల్లధనంపై కనీవినీ ఎరుగని శోధన...1.15కోట్ల పత్రాల్లో గుట్టురట్టు 
బద్దలైన కుబేరుల బాగోతం 
ప్రపంచవ్యాప్తంగా పనామా సునామీ.. 
జాబితాలో పుతిన్‌ సన్నిహితులు సహా అనేక దేశాల నేతలు 
రాజకీయ పీఠాలకు తప్పని కుదుపు! 
భారత్‌ నుంచి 500 మంది పేర్లు 
అమితాబ్‌, ఐశ్వర్యలతోపాటు స్థిరాస్తి దిగ్గజాలు కేపీ సింగ్‌, సమీర్‌ గెహ్లాట్‌ 
ల్లధనమే తెల్లబోయే లెక్కలివి.. ప్రపంచానికి దిమ్మదిరిగే గణాంకాలివి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సన్నిహితులు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బంధువులు, పాక్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ కుమారుల వరకు అనేకమంది ప్రపంచ నేతలు, వివిధ రంగాల ప్రముఖుల నల్ల జాతకాలు బట్టబయలయ్యాయి.
అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకరుల కూటమి (ఐ.సి.ఐ.జె.) పేరుతో వేర్వేరు దేశాల్లోని 100 మీడియా సంస్థల పాత్రికేయులు కూపీలాగి బయటపెట్టిన రహస్య పత్రాలు ఏకంగా 1.15 కోట్లు..! ఎకాఎకి 2.6 టెరాబైట్ల సమాచారాన్ని బయటకు లాగారు. చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద మీడియా శోధనల్లో ఇదొకటిగా అభివర్ణిస్తున్నారు. కట్టలు కట్టలుగా, గుట్టలు గుట్టలుగా ఖండాంతర దేశాల్లో గోప్యంగా దాచేసుకుని గుండెపై చేయివేసుకుని కూర్చొన్న పెద్దల పీఠాలు కదిలిపోయే పరిణామంగా అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలు దీనిని పేర్కొనడంలో అతిశయోక్తి లేదు. సుమారు 140 మంది రాజకీయ ప్రముఖులు వేర్వేరు చోట్ల సంపాదించిన ఆస్తిపాస్తుల బండారం బట్టబయలయింది. పన్నులు చెల్లించకుండానో, ఇతరత్రా అక్రమ మార్గాల్లోనో వందల వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్న పెద్ద మనుషుల్లో కనీసం 500 మంది భారతీయులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి.
ఏం జరిగింది?: ప్రపంచ వ్యాప్తంగా నల్ల కుబేరుల భోషాణాలు ఎక్కడెక్కడున్నాయో బయటపడింది.
ఎలా జరిగింది?: అంతర్జాతీయంగా ఓ కూటమిగా ఉన్న పరిశోధనాత్మక పాత్రికేయుల బృందం కొన్ని నెలల పాటు శ్రమించింది. నల్లధనాన్ని ఏ మార్గంలో ఎలా, ఎక్కడకు మళ్లిస్తున్నారో సాధికారిక ఆధారాలు సేకరించింది. ముఖ్యంగా పన్ను ఎగవేతదారులకు అనుకూలంగా ఉండే దేశాలకు అక్రమ ఆదాయాన్ని తరలించడంలో, అక్కడ పెట్టుబడులుగా మార్చడంలో కీలకంగా వ్యవహరించే సంస్థ నుంచి మొత్తం గణాంక సమాచారాన్ని ఒడిసి పట్టగలిగారు. ఆధార పత్రాల సంఖ్య ఏకంగా కోటి దాటడంతో ఇదో చరిత్రాత్మక ఘటనగా నిలిచిపోతోందని భావిస్తున్నారు. గతంలో వికీలీక్స్‌ ఎంత సంచలనం సృష్టించిందో అంతకంటే ఎక్కువ ప్రకంపనలు ఇప్పటికే మొదలయ్యాయి.
ప్రముఖులెవరు?: ఒకరా.. ఇద్దరా.. చైనా, రష్యా, పాకిస్థాన్‌, బ్రిటన్‌ సహా అనేక దేశాల అధినేతల పేర్లన్నీ వెలుగుచూశాయి. సన్నిహితుల పేరుతో కొందరు, కుటుంబీకుల సాయంతో ఇంకొందరు ఏమేం చేశారో తేటతెల్లమయింది. వీటి ఆధారంగా ఇప్పటికే ఆయా దేశాల్లో విపక్షాలు విమర్శనాస్త్రాలను పదునెక్కిస్తున్నాయి. అధికార పార్టీ తప్పుకోవాలనే డిమాండ్లు వూపందుకున్నాయి. భారత్‌లోనూ కుబేరుల జాబితా తక్కువేమీ కాదు. కనీసం 500 మంది ఉన్నారనే సమాచారం ఉలికిపాటు కలిగిస్తోంది.
నల్ల డబ్బెంత?: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు సయితం కూడలేనంత! కొన్ని దేశాల బడ్జెట్లనే మించిపోయినంత..!! ఒక అంచనా ప్రకారం మొత్తం నల్లధనం రూ.1550 లక్షల కోట్ల పైమాటే.
ఏం జరగబోతోంది?: తిరుగులేని ఆధారాలు బయటపడడంతో కొన్ని దేశాల్లో పీఠాలకే ఎసరొస్తోంది. ఖండాంతరాల్లో పోగుపడిన నల్లధనం తమది కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఆయా నేతలపై ఒక్కసారిగా పడింది. దీంతో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నల్ల కలకలం 
పారిస్‌
న్నులు చెల్లించకుండానో, ఇతరత్రా అక్రమ మార్గాల్లోనో వందల వేల కోట్ల రూపాయలు పోగు చేసుకున్న పెద్ద మనుషుల్లో కనీసం 500 మంది భారతీయులు ఉన్నారని పనామా పత్రాలు చెబుతున్నాయి. నేరుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేరు పత్రాల్లో లేకపోయినా ఆయనకు అత్యంత సన్నిహితులైన వ్యక్తులు కొన్ని బ్యాంకులు, బినామీ కంపెనీల ద్వారా రెండు బిలియన్‌ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ.13,400 కోట్లు) సొమ్మును రహస్యంగా తరలించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. లభ్యమైన పత్రాల ప్రకారం నల్ల కుబేరుల జాబితాలో 12 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలు ఉన్నారు. వీరిలో పాకిస్థాన్‌, ఐస్‌లాండ్‌ ప్రధానమంత్రులు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, సౌదీ అరేబియా రాజు, జాకీచాన్‌ వంటి సినీ దిగ్గజాలు, క్రీడాకారులు ఉన్నారు. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ కుటుంబానికి, బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ తండ్రికి (ఆయన దివంగతులయ్యారు.) విదేశీ ఖాతాలతో సంబంధాలున్నాయని పత్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం సమయంలో ఐస్‌లాండ్‌ ప్రధాని అనేక కోట్ల డాలర్ల సంపదను రహస్యంగా సొంతం చేసుకున్నారని పేర్కొంటున్నాయి. నిజానికి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఆ దేశంలో కమ్యూనిస్టు పార్టీ నేతల అక్రమ సంపదపై పెద్దఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించారు. ప్రపంచ ఫుట్‌బాల్‌ పాలక మండలి నైతిక సంఘం సభ్యుడు జ్యూయన్‌ పెడ్ర దామియానికి ఉన్న వ్యాపార సంబంధాలనూ పత్రాలు బట్టబయలు చేశాయి. లక్షల సంఖ్యలో లభ్యమైన పత్రాల సంఖ్య దృష్ట్యా ఈ అంశం ప్రపంచంలోనే అతిపెద్దది అవుతుందని ఐ.సి.ఐ.జె. డైరెక్టర్‌ గెరార్డ్‌ రైలె అభిప్రాయపడ్డారు. రహస్య ఒప్పందాలకు తాము వ్యతిరేకమనీ, చట్టపరమైన సంస్థలకు అన్నివిధాలా సహకారాన్ని అందిస్తామనీ పనామా ప్రభుత్వం తెలిపింది.
ఎవరెవరికి ముప్పు? 
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 
పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ 
బ్రిటన్‌ ప్రధాని కామెరాన్‌ 
సౌదీ అరేబియా రాజు 
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకో 
ఐస్‌లాండ్‌ ప్రధాని సిగ్‌ముండర్‌ డేవిడ్‌ గున్లాగ్సన్‌ 
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా 
కాంగో అధ్యక్షుడు డెనిస్‌ససౌ 
ప్రభుత్వాల్లో ప్రకంపనలు: నల్లధనం, అక్రమ సంపాదనల గుట్టు రట్టవడంతో అనేక ప్రభుత్వాల పీఠాలు కదిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ బావమరిది సహా ఎనిమిది మంది చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రస్తుత, మాజీ నేతల పేర్లు జాబితాలో ఉన్నాయి. చైనా మాజీ సైన్యాధిపతి గువో బోషియాన్‌ అవినీతి గురించీ ఇదే సమయంలో బయటపడడం కాకతాళీయమే అయినా ఇలాంటి వరస పరిణామాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐ.సి.ఐ.జె. వెబ్‌సైట్‌ను చైనాలో అధికారికంగా నిషేధించారు. పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ముగ్గురు పిల్లల పేర్లు (మరియం, హసన్‌, హుస్సేన్‌) పనామా పత్రాల్లో చోటు చేసుకోవడంతో ఆయన రాజకీయ దుమారంలో చిక్కుకున్నారు. తానెలాంటి తప్పు చేయలేదని షరీఫ్‌ అంటున్నా విపక్షం మాత్రం విచారణకు పట్టుపడుతోంది. షరీఫ్‌ తన పిల్లలకు అంత సొమ్ము ఎలా వచ్చిందో వివరణ ఇవ్వాలని పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌ డిమాండ్‌ చేశారు.
అభిశంసనలు... రాజీనామా డిమాండ్లు...: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పేట్రో పొరొషెంకోపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని ఉక్రెయిన్‌ పాపులిస్ట్‌ రాడికల్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. పనామా పత్రాలు వెల్లడిస్తున్న సమాచారం నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని ఐస్‌లాండ్‌లో 16 వేల మంది సంతకాలు చేశారు. ప్రధానిపై అవిశ్వాసం ప్రవేశపెడతామని విపక్షం ప్రకటించింది. బ్రెజిల్‌లో ప్రతిపక్షం సహా ఏడు పార్టీలకు చెందిన నేతల పేర్లు జాబితాలో ఉన్నాయి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్‌ జుమా మేనల్లుడి పేరు, కాంగో అధ్యక్షుడు డెనిస్‌ ససౌ కుమారుడి పేరు, ఘనా మాజీ అధ్యక్షుడు జాన్‌ అగ్యెకుం కుఫౌర్‌ కుమారుడి పేరు కూడా పనామా పత్రాల్లో చోటు చేసుకున్నాయి. కీలక పత్రాలు బయటపడడం వల్ల ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్‌ వ్యాఖ్యానించారు. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా... లీక్‌ అయిన పత్రాల నకలును తమకు సమర్పించాల్సిందిగా బ్రిటిష్‌ ప్రభుత్వం కోరింది. రాబోయే ఎన్నికలను దృష్టిలోపెట్టుకుని అస్థిరత సృష్టించడానికే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై నల్లధనం ఆరోపణలు చేస్తున్నట్లు క్రెమ్లిన్‌ వ్యాఖ్యానించింది. అర్జంటీనా మాజీ అధ్యక్షుడి అక్రమార్జనను దారి మళ్లించేందుకు అమెరికాలోని నెవడా రాష్ట్రంలో ఏకంగా 123 బోగస్‌ కంపెనీలను సృష్టించారు. ఐస్‌లాండ్‌ ప్రధాని సిగ్‌ముండర్‌ డేవిడ్‌ గున్లాగ్సన్‌ కొద్దిరోజుల్లోనే అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు.

భారత్‌లో
మన దేశ ఆర్థికరంగంలో మరో భిన్న కోణం బట్టబయలైంది. విదేశీసంస్థల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన వారి జాబితా తాజాగా మరోసారి వెల్లడైంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆంగ్లపత్రిక భాగస్వామిగా ఉన్న అంతర్జాతీయ పరిశోధనాత్మక విలేకరుల కూటమి (ఐసీఐజే) బయటపెట్టిన ‘పనామా పత్రాల్లో’ 500 మందికిపైగా భారతీయుల పేర్లున్నాయి. యావత్‌దేశం అభిమానంతో బిగ్‌బీగా పిల్చుకునే అమితాబ్‌బచ్చన్‌, ఆయన కోడలు, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్యరాయ్‌ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉండటం వారి అభిమానుల్ని ఆవేదనకు గురిచేసింది. వీరితోపాటు స్థిరాస్తి వ్యాపార రంగంలో దిగ్గజాలుగా పేరున్న డీఎల్‌ఎఫ్‌ అధిపతి పీకేసింగ్‌, ఇండియాబుల్స్‌ అధిపతి సమీర్‌ గెహ్లాట్‌, అపోలో టైర్స్‌ ఛైర్మన్‌ ఓంకార్‌ కన్వర్‌ తదితరులు ఉన్నారు. పన్ను అనుకూల బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌ తదితర దేశాల్లో వీరు ఏర్పాటుచేసిన కంపెనీలు, వాటిల్లో నిర్వహించిన లావాదేవీలు, పరోక్షంగా భారీఎత్తున జరిగిన లావాదేవీల వివరాలు వెల్లడయ్యాయి. అయితే తామంతా ఆర్‌బీఐ నిబంధనల మేరకే విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆయా ప్రముఖులు పేర్కొన్నారు.
అమితాబ్‌బచ్చన్‌
1993 నవంబరులో నాలుగు విదేశీ నౌకాయాన కంపెనీలకు అమితాబ్‌బచ్చన్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ కంపెనీల పేర్లు.. సీబల్క్‌ షిప్పింగ్‌ కంపెనీ లిమిటెడ్‌, లేడీ షిప్పింగ్‌ లిమిటెడ్‌, ట్రెజర్‌ షిప్పింగ్‌ లిమిటెడ్‌, ట్రాంప్‌ షిప్పింగ్‌ కంపెనీ. ఇవి బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌లో ఏర్పాటయ్యాయి. బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బహమాస్‌ నల్లధనం అనుకూల దేశాలు. ఈ కంపెనీల్లో పెట్టుబడిని అధికారికంగా 5,000-50,000 డాలర్లుగా మాత్రమే చూపించినప్పటికీ.. నౌకల వ్యాపారం పేరుతో ఈ సంస్థలు కొన్ని కోట్ల డాలర్ల వ్యాపారం నిర్వహించినట్లు వెల్లడైంది. ఈ కంపెనీలకు మేనేజింగ్‌ డైరక్టర్‌గా కూడా అమితాబ్‌ వ్యవహరించారు. వాస్తవానికి వీటిని ఉమేశ్‌సహాయ్‌, డేవిడ్‌మైఖేల్‌పెట్‌ అనే వ్యక్తులు వ్యవస్థాపక డైరెక్టర్లుగా ఏర్పాటుచేశారు. ఈ కంపెనీల్లో జరిగిన మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే అమితాబ్‌బచ్చన్‌ను సహాయ డైరెక్టర్‌గా నియమించటం గమనార్హం. 1994లో ట్రాంప్‌ షిప్పింగ్‌ కంపెనీ, జెడ్డాకు చెందిన డైకో అనే కంపెనీకి మధ్య పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. దీనికి పూచీదారుగా కాన్‌స్టలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌ అనే మరో సంస్థ సంతకం చేసింది. అనంతరం ట్రాంప్‌ కంపెనీ నుంచి వెయ్యివాటాలు కాన్‌స్టలేషన్‌ షిప్‌ మేనేజ్‌మెంట్‌కు బదిలీ అయ్యాయి. 1997లో అమితాబ్‌ ఇతర డైరెక్టర్లతో కలిసి ట్రాంప్‌ షిప్పింగ్‌ బోర్డు నుంచి రాజీనామా చేశారు. కాన్‌స్టలేషన్‌ కంపెనీ యజమాని కెప్టెన్‌ మెహెర్‌నూష్‌ ఖజోటియా 1998లో భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు. 2006లో ఆయన మరణించారు. ముంబయిలోని పొలారిస్‌ గ్రూప్‌నకు, డైకోకు మధ్య తలెత్తిన వివాదం 2008లో బొంబాయి హైకోర్టును చేరింది.
కుశాల్‌పాల్‌సింగ్‌, డీఎల్‌ఎఫ్‌
నదేశంలోని అతిపెద్ద స్థిరాస్తి కంపెనీల గ్రూపు డీఎల్‌ఎఫ్‌ సంస్థ ప్రమోటర్‌ కుశాల్‌పాల్‌సింగ్‌ (కేపీ సింగ్‌) బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటైన ‘విల్డర్‌ లిమిటెడ్‌’ కంపెనీని సొంతం చేసుకున్నారు. ఆయన భార్య ఇందిర ఈ కంపెనీలో సహవాటాదారుగా ఉన్నారు. ఈ కంపెనీ 1 జులై 2010లో నమోదైంది. దీని పెట్టుబడి రూ.16 కోట్లు. కేపీ సింగ్‌ కుమార్తె పియాసింగ్‌, కుమారుడు రాజీవ్‌సింగ్‌ కూడా బ్రిటీష్‌ ఐలాండ్స్‌లోనే మరో రెండు కంపెనీల వాటాలను కొనుగోలు చేశారు. 2012లో నమోదైన ఆల్ఫా ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌ కంపెనీలో పియాసింగ్‌, ఆమె భర్త ధీరజ్‌ టిమ్మీ సార్నా, వారి పిల్లలు జైసార్నా, తారాసింగ్‌సార్నా వాటాదారులుగా చేరారు. ఈ సంస్థ పెట్టుబడి రూ.25 కోట్లు. పీకేసింగ్‌ కుమారుడు రాజీవ్‌సింగ్‌ (డీఎల్‌ఎఫ్‌ గ్రూపు వైస్‌ఛైర్మన్‌) ‘బెకాన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ లిమిటెడ్‌’ అనే సంస్థలో వాటాదారుగా చేరారు. రాజీవ్‌తోపాటు ఆయన భార్య కవిత, కుమార్తెలు అనుష్క, సావిత్రి కూడా ఈ సంస్థలో వాటాలు తీసుకున్నారు. ఈ సంస్థ 2 జనవరి 2012లో నమోదైంది. దీని పెట్టుబడి రూ.25 కోట్లు. విల్డర్‌ లిమిటెడ్‌, ఆల్ఫా ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌, బెకాన్‌ ఇన్‌వెస్ట్‌మెంట్స్‌ గ్రూప్‌ లిమిటెడ్‌ల గురించి డీఎల్‌ఎఫ్‌ 2013-14 వార్షిక నివేదికలో ప్రస్తావించారు. ‘కీలక మేనేజ్‌మెంట్‌ వ్యక్తులు, వారి బంధువుల నియంత్రణలో ఉన్న సంస్థలు’గా వీటిని పేర్కొన్నారు.
సమీర్‌ గెహ్లాట్‌, ఇండియాబుల్స్‌
దేశంలోని అతిపెద్ద స్థిరాస్తి గ్రూపు సంస్థల్లో ఒకటైన ఇండియాబుల్స్‌ అధిపతి సమీర్‌ గెహ్లాట్‌. ఆయన సోదరుడు నాగేంద్ర, తండ్రి బల్వాన్‌సింగ్‌ కూడా గ్రూపుసంస్థల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. హరియాణాలోని కర్నాల్‌, దిల్లీ, బహమాస్‌, జెర్సీ, బ్రిటన్‌లలో ఉన్న తమ సంస్థల ద్వారా లండన్‌లోని మూడు స్థిరాస్తి ప్రాజెక్టులను సమీర్‌ కుటుంబం దక్కించుకుంది. వీటిని ప్రస్తుతం నివాస, హోటల్‌ ప్రాజెక్టులుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కూడా 2012 అక్టోబర్‌లో ఏర్పాటైన ఎస్‌జీ ఫ్యామిటీ ట్రస్ట్‌ యాజమాన్యం కింద ఉన్నాయి. దిల్లీలోని కాలీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఈ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉందని, సదరు కాలీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ బహమాస్‌లోని క్లైవెడేల్‌ ఓవర్సీస్‌ లిమిటెడ్‌ అనే సంస్థను సొంతం చేసుకుందని తాజాగా పనామా పత్రాల్లో వెల్లడైంది. అంతేకాదు.. క్లైవెడేల్‌ ఓవర్సీస్‌ కంపెనీ ఆధ్వర్యంలో అనేక అనుబంధ కంపెనీలు పని చేస్తున్నాయని.. ఇవన్నీ బహమాస్‌, మారిషస్‌, బ్రిటన్‌, జెర్సీల్లో ఉన్నట్లు తేలింది. వీటన్నింటికీ కర్నాల్‌లోని ఎస్‌జీ ఫ్యామిటీ ట్రస్టుతో సంబంధం ఉంది. లండన్‌లోని మూడు భారీ స్థిరాస్తి ప్రాజెక్టులు క్లైవెడేల్‌ సంస్థ యాజమాన్యం కింద ఉన్నట్లు వెల్లడైంది.
ఐశ్వర్యారాయ్‌
28 అక్టోబర్‌ 2004న ‘అమిక్‌ పార్ట్‌నర్స్‌ లిమిటెడ్‌’ అనే పేరుతో ఒక కంపెనీ బ్రిటీష్‌ వర్జిన్‌ ఐల్యాండ్స్‌లో నమోదైంది. 50 వేల డాలర్లతో ఏర్పాటైన ఈ కంపెనీకి ఐశ్వర్యారాయ్‌తోపాటు ఆమె కుటుంబసభ్యులు 14 మే 2005న డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వీరిలో ఐశ్వర్యారాయ్‌ తండ్రి కృష్ణరాయ్‌, తల్లి వృందాకృష్ణరాజ్‌రాయ్‌, సోదరుడు ఆదిత్యరాయ్‌ ఉన్నారు. ఈ నలుగురూ 12,500 వాటాల చొప్పున కలిగి ఉన్నారు. ఒక్కోవాటా విలువ ఒక డాలరు. 2005 జూన్‌ 18న కంపెనీ చేసిన ఒక తీర్మానం ద్వారా ఐశ్వర్య, ఆమె తల్లి వృంద డైరెక్టర్‌ పదవుల నుంచి తప్పుకొని వాటాదారులుగా పరిమితమయ్యారు. దుబయ్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐశ్వర్య తండ్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కుటుంబసభ్యులందరూ హాజరయ్యారు. ఐశ్వర్యరాయ్‌ అనే పేరును ఏ.రాయ్‌ అని మార్చారు. ఈ మార్పును డైరెక్టర్లు, వాటాదారులందరూ ఆమోదించారు. అభిషేక్‌బచ్చన్‌తో ఐశ్వర్య వివాహం జరిగిన తర్వాత మరుసటి ఏడాది (2008లో) కంపెనీని రద్దు చేసే ప్రక్రియ మొదలైంది. మొత్తానికి కంపెనీ ఎప్పుడు రద్దయ్యిందనేదానిపై స్పష్టత లేదు. ఆ ప్రక్రియ 2008లోనే పూర్తయిందని కొన్ని పత్రాలు, 2016 వరకూ కొనసాగిందని మరికొన్ని పత్రాలు వెల్లడిస్తున్నాయి.
గర్వారే కుటుంబం
మొసాక్‌ ఫోన్సెకా రికార్డుల ప్రకారం గర్వారే కుటుంబానికి పలు విదేశీ సంస్థలతో సంబంధం ఉంది. 1996లో బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టర్‌ చేసిన రాండార్‌ ఓవర్సీస్‌ లిమిటెడ్‌లో అశోక్‌గర్వారే షేర్‌హోల్డర్‌. ఆదిత్య గర్వారే, సుష్మా గర్వారేలకు పలు పనామా సంస్థల్లో పవర్‌ ఆఫ్‌ అటార్నీ(పీవోఏ) ఉంది. గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌ సర్వీసెస్‌కు అశోక్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, ఆయన తనయుడు ఆదిత్య ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆదిత్య, సుష్మా గర్వారేలకు కనీసం ఆరు పనామా సంస్థల్లో పీఓఏ ఉందని తెలుస్తోంది. ఇవన్నీ 2009 నుంచి పనిచేయడం లేదు. గర్వారేలు ఫుజియామా టీం ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. అశోక్‌, సుష్మా, ఆదిత్య ప్రధాన లబ్ధిదారులు.
స్పందన: కంపెనీ సెక్రటరీ ఏసీ చందరణ స్పందిస్తూ.. ఈ ప్రశ్నలన్నీ ఐదేళ్ల క్రితంవనీ, మరోసారి వీటిని పరిశీలిస్తామన్నారు. పీవోఏల గడువు ముగిసిపోయాయనీ, సంస్థలు రద్దయ్యాయన్నారు. అశోక్‌ గర్వారే, ఆయన కుటుంబానికి సదరు సంస్థలతో ఏ సంబంధం లేదన్నారు.
ఓంకార్‌ కన్వర్‌
పోలో గ్రూప్‌ ఛైర్మన్‌. ఓంకార్‌, ఆయన కుటుంబం బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో 2010లో జేఅండ్‌ఎస్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్‌ను, 2014లో రెండు ట్రస్టులను ఏర్పాటు చేసింది. ఫోన్సెకా రికార్డుల్లో పలు వివరాలున్నాయి. ఓంకార్‌తోపాటు నీరజ్‌, సిమ్రాన్‌ కన్వర్‌లూ జేఅండ్‌ఎస్‌లో షేర్‌హోల్డర్లే. ఓంకార్‌ భార్య తారుకన్వర్‌కు షేర్లున్నాయి.
స్పందన: అపోలో టైర్స్‌ గ్రూప్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. కొన్ని నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడుల్ని భారత్‌ చట్టబద్ధంగానే అనుమతిస్తోంది. భారత చట్టాల ప్రకారమే విదేశీ పెట్టుబడులున్నాయి.
జహంగీర్‌ ఎస్‌ సొరాబ్జీ
మాజీ అటార్నీ జనరల్‌ సోలి సొరాబ్జీ కుమారుడు జహంగీర్‌ సోలి సొరాబ్జీ. 2010లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటు చేసిన మూన్‌గ్లోవ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌లో ఏకైక షేర్‌హోల్డర్‌. ఫోన్సెకా రికార్డుల ప్రకారం..కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.
స్పందన: సరళీకృత ఆర్‌బీఐ పథకంలో భాగంగానే భారత్‌ నుంచి పెట్టుబడులు విదేశానికి వెళ్లాయన్నారు. ఆదాయపన్ను రిటర్నుల్లో వివరాలను వెల్లడించానన్నారు.
మోహన్‌లాల్‌ లోహియా
ప్రముఖ పారిశ్రామికవేత్త. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. 2007లో బ్రిటన్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టర్‌ చేసిన వెంటన్‌ గ్రూప్‌ లిమిటెడ్‌లో ఫస్ట్‌ డైరెక్టర్‌. 2010లో పనామాలో లోహియా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను సైతం ఏర్పాటుచేశారు. ఆయన మనవలు సభ్యులు.
స్పందన: లోహియా కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయులనీ, విదేశాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్నారనీ, విదేశాల్లోని సంస్థల గురించి తమకు తెలియదనీ, ప్రవాస భారతీయులు విదేశాల్లో చేసే కార్యకలాపాల గురించి ఆదాయపన్ను అధికారులకుగానీ, ఆర్‌బీఐకిగానీ తెలియజేయాలనేదేమీ లేదని కంపెనీ అధికారప్రతినిధి పేర్కొన్నారు.
జవరే పూనావాలా
ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. జవరే, భార్య బెహ్రోజ్‌, కుమార్తెలు సైమోన్‌, డెల్నాలు 2013లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటుచేసిన స్టాలాస్ట్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్లు.
స్పందన: తాము ఆ కంపెనీలో సంచాలకులమేననీ, సరళీకృత పథకం ద్వారానే డబ్బులు తరలించామనీ, ఇందుకు ఆర్‌బీఐ అనుమతి అక్కర్లేదనీ, అధికారిక లావాదేవీయేనన్నారు. అన్ని వివరాలూ వెల్లడించామని జవరే పేర్కొన్నారు.
శిశిర్‌ కె.బజోరియా
కోల్‌కతాలో జౌళి,తేయాకు వ్యాపారం చేసే వ్యాపార కుటుంబానికి చెందిన వ్యక్తి..శిశిర్‌ బజోరియా. ఎస్కే బజోరియా గ్రూప్‌ ప్రమోటర్‌. దీనికి ఆరు దేశాల్లో స్టీల్‌ రీఫ్రాక్టరీ యూనిట్లు ఉన్నాయి. 2015లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని హ్యాప్టిక్‌ లిమిటెడ్‌కు లబ్ధిదారులైన యజమాని. దీనిని మొసాక్‌ ఫోన్సెకా సంస్థ, ఫస్ట్‌నేమ్స్‌గ్రూప్‌తో కలిసి బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో 2015లో ఏర్పాటు చేసింది. హ్యాప్టిక్‌ కోసం ఫోన్సెకా రికార్డుల్లో బజోరియా పాస్‌పోర్ట్‌ ప్రతి, అతని భారత చిరునామా కూడా ఉన్నాయి. పశ్చిమ్‌బంగా మాజీ ముఖ్యమంత్రి జ్యోతిబసుకు సన్నిహితుడైన బజోరియా సీపీఎం సభ్యత్యాన్ని వదులుకొని 2014లో భాజపాలో చేరారు. రాబోయే పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా కీలక ప్రచారకర్తల్లో ఒకరు.
స్పందన: హ్యాప్టిక్‌ లిమిటెడ్‌కు ఎప్పుడూ యజమానిని కాననీ, పొరపాటుగా తనకు సంబంధాన్ని ఆపాదించారని భావిస్తున్నానన్నారు. లబ్ధిదారులైన యజమానికి సంబంధించిన సమాచారాన్ని పంపడంలో తాము పొరపాటు చేశామని ఫస్ట్‌నేమ్స్‌ గ్రూప్‌ ప్రతినిధి సీజీ హెప్‌బర్న్‌ పేర్కొన్నారు.
హరీశ్‌సాల్వే
దేశంలో ప్రఖ్యాత న్యాయవాది. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని మూడు కంపెనీలకు హరీశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లండన్‌కు చెందిన రావిఅండ్‌కో ద్వారా విదేశీ కంపెనీలను రిజిస్టర్‌ చేశారు. 2007లో రమేశ్‌, ఆశా మహాజన్‌ల కోసం ఓ కంపెనీ, ట్రస్టును ఏర్పాటు చేయాల్సిందిగా సాల్వే రావిఅండ్‌కంపెనీకి సిఫారసు లేఖ రాశారు. సాల్వే క్రెస్ట్‌బ్రైట్‌ లిమిటెడ్‌లో సంచాలకులని పత్రాల్లో ఉంది. మరో రెండు కంపెనీలకు సాల్వే భార్య మీనాక్షి, కుమార్తె సాక్షి సంచాలకుల్లా ఉన్నారు.
స్పందన: చట్టబద్ధంగా, దాపరికంలేని పెట్టుబడుల కోసం 2012లో క్రెస్ట్‌బ్రైట్‌ను ఏర్పాటుచేశాననీ, కంపెనీలో మిగులేమీ లేదన్నారు. మూడు కంపెనీలూ పనిచేయడం లేదన్నారు. భారత్‌, యూకేల్లోని బ్యాంకు వివరాలనూ సమర్పించాననీ, ఏవీ పక్కనపెట్టలేదని సాల్వే తెలిపారు.
ఇందిరా శివశైలం, మల్లిక శ్రీనివాసన్‌
మల్గమేషన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనంతరామకృష్ణన్‌ భార్య ఇందిర 2008లో అనారోగ్యంతో మరణించారు. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. 1999లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఏర్పాటైన స్టాన్‌బ్రిడ్జ్‌ కంపెనీ లిమిటెడ్‌లో ఇందిర షేర్‌హోల్డర్‌. వీరి షేర్లను కుమార్తెలకు బదిలీ చేశారు. 2011లో మల్లిక తన షేర్లను వీపీఅహూజాకు ఇచ్చేశారు.
స్పందన: తానెలాంటి విదేశీ కంపెనీని ఏర్పాటుచేయలేదని మల్లికా శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. స్టాన్‌బ్రిడ్జ్‌ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదనీ, అది అహూజాదని మల్లిక పేర్కొన్నారు. ఆ కంపెనీ తన ప్రయోజనాల కోసం ఏర్పాటుచేసినట్లు అహూజా తెలిపారు.
అనిల్‌ వాసుదేవ సల్గోకర్‌
గోవాకు చెందిన గనుల వ్యాపారి. ఫోన్సెకా సాయంతో 11 విదేశీ కంపెనీలను ఏర్పాటుచేశారు. వీటిలో ఎక్కువగా బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లోనే ఏర్పాటయ్యాయి. ఎక్కువ భాగం 2004-05 మధ్యే నెలకొల్పినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2007లో ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన సందర్భంగా అనిల్‌ ఈ కంపెనీల వివరాలేమీ ఈసీకి వెల్లడించలేదు. అనిల్‌ అనారోగ్యంతో మరణించారు.
స్పందన: సదరు కంపెనీల గురించి తమకేమీ తెలియదని అనిల్‌ కుటుంబసభ్యులొకరు పేర్కొన్నారు.
రాజేంద్ర పాటిల్‌
రాజేంద్రపాటిల్‌..సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, కర్ణాటక ఉద్యానమంత్రి షమనూర్‌ శివశంకరప్ప అల్లుడు. ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. పాటిల్‌ అనుయాయులు సంజయ్‌ నాద్గౌడ, శశాంక్‌ అంగడి 2007లో బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌లో ఎల్గెన్‌బర్గ్‌ లిమిటెడ్‌ అనే కంపెనీని నెలకొల్పారు. ఇందులో పాటిల్‌కూ హోల్డింగ్‌ ఉంది.
స్పందన: ఐరోపాలో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ జారీ చేసేందుకే కంపెనీ ఏర్పాటుచేశామని పాటిల్‌ పేర్కొన్నారు. నష్టాలు రావడంతో అదే ఏడాది మూసేశామన్నారు.
తబసుమ్‌, అబ్దుల్‌ రషీద్‌ మిర్‌
ఫోన్సెకా రికార్డుల ప్రకారం.. 2002లో పనామాలో సీఐఈ అనే సంస్థను ఏర్పాటుచేశారు.
స్పందన: తనకుగానీ, అబ్దుల్‌రషీద్‌కుగానీ ఎలాంటి వాటాలు లేవని తబసుమ్‌ పేర్కొన్నారు. అది ట్రస్టు నియంత్రణలో ఉందనీ, అది కూడా రద్దయిందన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి