5, ఏప్రిల్ 2016, మంగళవారం

బద్దలైన కుబేరుల బాగోతం పార్ట్‌-2 
పనామా పేపర్స్‌తో వెలుగులోకి వచ్చిన నల్లధన కుబేరుల్లో 500 మంది భారతీయులున్న సంగతి తెలిసిందే. తాజాగా వారిలో మరికొందరి పేర్లు వెల్లడయ్యాయి. నిన్న బాలీవుడ్‌ ప్రముఖులు.. అమితాబ్‌ బచ్చన్‌.. ఐశ్వర్యారాయ్‌.. కొందరు వ్యాపారవేత్తల పేర్లు మాత్రమే వెల్లడి కాగా.. ఈ రోజు మరికొందరి పేర్లు బయటపడ్డాయి. ఆ జాబితా చూస్తే..
1. అశ్వని కుమార్‌ మెహతా 
1999 నుంచి ఇతని కుటుంబ సభ్యుల పేర్లతో కరీబియన్‌ దీవులు.. బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో 7 ఆఫ్‌షోర్‌ సంస్థలు రిజిస్టరై ఉన్నట్లు తేలింది. మెహతా.. అతని భార్య.. ఇద్దరు కుమారుల పేరుమీదే కాకుండా.. కోడళ్లను డైరెక్టర్లుగా పేర్కొన్నట్లు మొసాక్‌ ఫొన్సెకా పత్రాల్లో వెల్లడైంది.
వారి స్పందన: ‘మాకు స్టోన్‌బై ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌.. మ్యాక్స్‌హిల్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. కానీ.. పెట్టుబడులు అన్నీ సాధారణ బ్యాంకు లావాదేవీల ద్వారానే పెట్టాం. ఆ వివరాలను మా ఐటీ రిటర్న్స్‌లోనూ చూపించాం’.
2. అనురాగ్‌ కేజ్రీవాల్‌(లోక్‌సత్తా పార్టీ దిల్లీ మాజీ అధ్యక్షుడు) 
బ్రిటిష్‌ వర్జిన్‌ దీవుల్లో కనీసం మూడు సంస్థలు.. పనామాలో రెండు ప్రైవేటు ఫౌండేషన్లకు ఇతను డైరెక్టరుగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. నెవింగ్టన్‌ గ్రూప్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌.. నెడ్‌స్టార్‌ కమర్షియల్‌ లిమిటెడ్‌.. క్రిమ్స్‌ ఇన్వెస్టిమెంట్స్‌ ఇన్‌కార్పొరేట్‌ అనే సంస్థలు బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రిజిస్టరై ఉన్నట్లు తెలిసింది.
స్పందన: తాను వ్యాపారవేత్తనని, ఐరన్‌ ఓర్‌ బిజినెస్‌ చేస్తానని అనురాగ్‌ తెలిపారు. మంచిమార్గంలోనే కమిషన్‌ పొందామన్నారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ సాయంతో ఈ సంస్థలు ఏర్పాటుచేసినా వాటివల్ల సమస్యలు వస్తాయని త్వరగానే అర్థమైందన్నారు. భారతీయ రిజర్వు బ్యాంకు నియమనిబంధనల గురించి చెప్పుకొస్తూ తమ వద్ద స్ట్రాంగ్‌ కేపిటల్‌ బేస్‌ లేనందువల్ల రెండు ఫౌండేషన్లను త్వరగానే మూసేశామని ఆయన చెప్పారు.
3. గౌతమ్‌ మరియు కరన్‌ థాపర్‌ 
క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ సంస్థకు చెందిన వీళ్లకు పనామాలో చార్ల్‌వుడ్‌.. నికామ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్లు ఉన్నాయి. 2005 జులైలో చార్ల్‌వుడ్‌ ఫౌండేషన్‌ను 10వేల అమెరికన్‌ డాలర్లతో ప్రారంభించినట్లు పత్రాల్లో తేలింది. అదే ఏడాది అక్టోబర్‌లో నికామ్‌ ఇంటర్నేషనల్‌ను కూడా స్థాపించారు.
స్పందన: గౌతమ్‌ థాపర్‌ తరఫున ఆయన ప్రతినిధి మాట్లాడుతూ.. థాపర్‌ ఎలాంటి ఫౌండేషన్‌ను ప్రారంభించలేదు. ఒక్క ఆఫ్‌షోర్‌ కంపెనీలోనూ ఆయనకు షేర్లు/భాగస్వామ్యం లేవు. జర్మన్‌ పౌరసత్వం ఉన్న అతని భార్య మాత్రం చార్ల్‌వుడ్‌ ఫౌండేషన్‌లో లబ్ధిదారుగా ఉన్నారు.. అని చెప్పారు.
4. సతీష్‌ గోవింద్‌ సాంతాని, విష్లావ్‌ బహదూర్‌, హరీశ్‌ మొహ్నాని 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో రెండు సంస్థలకు ఈ ముగ్గురు డైరెక్టర్లుగా ఉన్నారు. 2008 డిసెంబర్‌ 4న డిజైన్‌ అండ్‌ క్వాలిటీ లిమిటెడ్‌, 2007 నవంబర్‌లో త్రిలియాన్‌ లిమిటెడ్‌ అనే ఆఫ్‌షోర్‌ కంపెనీలను ప్రారంభించారు.
స్పందన: ‘‘చైనా నుంచి దుస్తులు.. ఇతర సరుకులను రవాణా చేసేందుకు ఆ రెండు సంస్థలను స్థాపించాం. మూడు సంవత్సరాలు నడిపిన తర్వాత మూసివేశాం’’ అని విష్లావ్‌ బహదూర్‌ అన్నారు.
5. గౌతమ్‌ సీంగల్‌ 
400 మిలియన్‌ డాలర్ల ప్రైవేటు ఈక్విటీ ఫండ్‌తో లింకప్‌ ఉన్నట్లు తేలింది. అలాగే.. అతని పేరుతోనే మరో రెండు ఆఫ్‌షోర్‌ సంస్థలు కూడా రిజిస్టరై ఉన్నాయి. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఐమీడియా వెంచర్స్‌ లిమిటెడ్‌ను 2006లో ప్రారంభించాడు. దాన్ని 2009 నవంబర్‌లో జెఫ్‌ మోర్గాన్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌గా పేరు మార్చారు.
స్పందన: నాకు ఆ ఆఫ్‌షోర్‌ సంస్థలతో సంబంధం లేదు. అవి.. మా నాన్నకు చెందినవి. కుటుంబం నుంచి విడిపోయాక.. ఆ కంపెనీలకు చాలా దూరంగా ఉంటున్నా. అవి కూడా ప్రస్తుతం మూతపడ్డాయనుకుంటున్నాను.
6. ప్రకాశ్‌ సంఖ్లా 
మధ్యప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అయిన ప్రకాశ్‌ సంఖ్లాకు పనామాలో లోటస్‌ హారిజాన్‌ ఎస్‌ఏ అనే సంస్థ ఉంది. అందులో ఆయన కుమార్తెలు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసంది.
‘‘నా అల్లుడు పెద్ద బిజినెస్‌ మ్యాన్‌. నిత్యం వివిధ దేశాలు తిరుగుతుంటాడు. అతనికి యూఎస్‌.. కెనడాలో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఆయన సంస్థల్లో నేను ఒక్క పైసా కూడా పెట్టుబడిగా పెట్టలేదు’’ అని సంఖ్లా అన్నారు.
7. వినోద్‌ రామ్‌చంద్ర జాదవ్‌ 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో పలు సంస్థలున్నాయి. పుణెలోని సవా హెల్త్‌కేర్‌ సంస్థకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న వినోద్‌.. పలు ఆఫ్‌షోర్‌ కంపెనీల్లో షేర్‌ హోల్డర్‌గా.. డైరెక్టరుగా ఉన్నారు. వాటిల్లో 2010 నుంచి 2015 మధ్యలో స్థాపించినవే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
స్పందన: అన్ని గ్లోబల్‌ కంపెనీల ఆదాయ వివరాలను రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కి సమర్పించాం. కానీ గతేడాది ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ఏ వివరాలను రహస్యంగా ఉంచలేదు.
8. అశోక్‌ మల్హోత్రా 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని ఈ అండ్‌ పీ ఆన్‌లుకర్స్‌ లిమిటెడ్‌ సంస్థకు షేర్‌ హోల్డర్‌గా.. డైరెక్టర్‌గా ఉన్నారు. 2008 సెప్టెంబర్‌ 25న ఈ సంస్థను స్థాపించినట్లు పనామా పేపర్స్‌ వెల్లడిస్తున్నాయి.
స్పందన: షేర్లు ట్రాన్స్‌ఫర్‌ అయ్యినా.. నాకు గుర్తు లేదు. అది చాలా ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడే షేర్లన్నీ అమ్మేశాం.
9. రంజీవ్‌ దహుజా, కపిల్‌ సైన్‌ గోయల్‌ 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఉన్న బీల్స్‌ ఇంటర్నేషనల్‌ కార్ప్‌ సంస్థకు డైరెక్టర్లుగా ఉన్నారు. 2012 జూన్‌లో ప్రారంభించిన ఈ కంపెనీలో వీళ్లు 5000 షేర్లు కలిగి ఉన్నారు.
స్పందన: ‘‘మేము కొన్ని సంవత్సరాల క్రితం ఈ కంపెనీని ప్రారంభించాం. కానీ.. ఇప్పటి వరకూ ఒక్క పని కూడా చేయలేదు. కొందరు తప్పుదారి పట్టించడం వల్ల ఆ కంపెనీని స్థాపించాల్సి వచ్చింది’’ అని కపిల్‌ సైన్‌ గోయల్‌ అన్నారు.
10. వివేక్‌ జైన్‌ 
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లోని ‘సాక్వినవ్‌ గ్లోబల్‌ ఎస్‌ఏ’కు డైరెక్టర్‌గా.. హాంకాంగ్‌లో ఉన్న రేడియంట్‌ వరల్డ్‌ హోల్డింగ్స్‌లో షేర్లు కలిగి ఉన్నారు.
స్పందన: ‘‘ఈ కంపెనీలు ఉన్నట్లు నాకు ఐడియా లేదు. నా పేరు.. అడ్రస్‌తో కంపెనీ రిజిస్టరై ఉంటే నాకు తెలిసి ఉండేది’’ అని వివేక్‌ జైన్‌ అన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి