15, ఫిబ్రవరి 2015, ఆదివారం

నల్లధనం ఉచ్చులో హెచ్‌ఎస్‌బిసి ఇండియా

లండన్‌: హెచ్‌ఎస్‌బిసి పన్ను ఎగవేతదారులకు సహకరించిందన్న వివాదంలో అటుతిరిగి ఇటుతిరిగి బ్యాంకు ఇండియా విభాగం కేంద్రబిందువుగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం హెచ్‌ఎస్‌బిసి బ్యాంకుకు చెందిన స్విస్‌ యూనిట్‌ పన్ను ఎగవేతదారులకు సాయం చేసిందని బయట పడ్డ విషయం తెలిసిందే. ఇదేసమయంలో కొందరు హెచ్‌ఎస్‌బిసి ఇండియా బ్యాంకు ప్రతినిధులు సైతం పన్ను అధికారులకు అకౌంట్ల వివరాలు ఇవ్వబోమని ఖాతాదారులకు హామీ ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు సంపన్నులు పన్ను ఎగవేసేందుకు తమ స్విస్‌ బ్రాంచ్‌ అధికారులు సహాయం చేసారన్న నివేదికలు రావడంతో బ్రిటిష్‌ వార్తాపత్రికల్లో బ్యాంకు ఒక ఫుల్‌ పేజీ క్షమాపణ ప్రకటన జారీ చేసింది. పన్ను ఎగవేతదారులతో వ్యాపారం చేయాల్సిన అవసరం తమకు లేదని కంపెనీ సిఇఒ స్టువర్ట్‌ గలివర్‌ ఈ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిణామాలు బాధాకరమన్నారు. గత ఎనిమిదేళ్ల క్రితం తమ స్విస్‌ విభాగం అవలంబించిన ప్రమాణాలు ఇప్పుడు లేవన్నారు. అయితే తాజాగా బయటకొచ్చిన కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం హెచ్‌ఎస్‌బిసి ఇండియా అమెరికాలో ఉంటున్న చాలామంది భారతీయులకు పన్నులు ఎగవేసేందుకు సలహాలిచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు కస్టమర్ల వివరాలను పన్ను అథారిటీలతో పంచుకోవాలన్న ఒప్పందం పైనే బ్యాంకు సేవలు ప్రారంభించారని ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన వివరాల్లో తెలిపింది. అయితే హెచ్‌ఎస్‌బిసి బ్యాంకు ఐఆర్‌ఎస్‌ (ఇన్‌లాండ్‌ రెవెన్యూ సర్వీసెస్‌)కు వివరాలివ్వడంలో విఫలమైందని తెలిపింది. చాలామంది హెచ్‌ఎస్‌బిసి ఇండియాలో ఖాతాలున్న అమెరికా పన్ను చెల్లింపుదారులు తమ అకౌంట్ల వివరాలను, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని తెలిపింది. బ్యాంకులో 9000 మంది ప్రవాస భారతీయులు ఖాతాలుండగా, కేవలం 1400 మందే తమ ఖాతాల వివరాలను వెల్లడించారు. మరో కేసులో హెచ్‌ఎస్‌బిసి ఇండియా అధికారులు అమెరికాకు చెందిన న్యూరోసర్జన్‌ అరవింద్‌ అహుజా 55 లక్షల పౌండ్లు రహస్యంగా దాచుకునేందుకు సాయం చేశారని పేర్కొంది. ఈ కేసులో కోర్టు అహుజాకు 2.2 లక్షల పౌండ్ల జరిమానాతో పాటు మూడేళ్ల ప్రొబేషన్‌ను విధించింది. మరో కేసులో ప్రవాసభారతీయుడు వైభవ్‌ దహకె అక్రమంగా నిధులు బదిలీ చేసుకొనే మార్గాలను బ్యాంకు అధికారులు అందించారని పేర్కొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి