16, ఫిబ్రవరి 2015, సోమవారం

మాస్టర్ ప్లాన్‌కు రూ. 1,200 కోట్లు!

Sakshi | Updated: November 25, 2014 02:29 (IST)
కన్సల్టెన్సీ ఫీజుగా ఆంధ్రప్రదేశ్‌ను కోరిన సింగపూర్ సర్కారు
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వం.. కన్సల్టెన్సీ చార్జీలుగా ఏకంగా రూ. 1,200 కోట్లు చెల్లించాలని కోరినట్లు సమాచారం. కొత్త రాజధాని నిర్మాణానికి ఏర్పాటు చేయబోయే కంపెనీలో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన సింగపూర్ ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కన్సల్టెన్సీగా వ్యవహరించడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేసింది.

 ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ఇవ్వాల్సిందిగా స్వయంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేస్తామని, ఆ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ వాటా 51 శాతం, సింగపూర్ ప్రభుత్వం 49 శాతం వాటాగా ఏర్పాటు చేద్దామని బాబు ఇటీవల సింగపూర్ పర్యటనలో ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. సింగపూర్ ప్రభుత్వం మాత్రం సదరు కంపెనీలో వాటాకు ఆసక్తి చూపలేదని విశ్వసనీయ సమాచారం.దీంతో  మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మాత్రమే సింగపూర్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి.

స్పెషల్ స్టోరీస్ 

భూసేకరణం

andhraprabha -   Sun, 11 Jan 2015, IST
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మనిషి భూమి మీద నిలబడలేక దాని చుట్టూ తిరుగుతున్నాడు. భూ సంస్కరణలు, భూముల కేటాయింపులు, భూముల బదిలీలు, భూ పోరాటాలు మొదలైనవన్నీ గతంలో కమ్యూనిస్టుల అజెండాలోని ముఖ్యాంశాలు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత భూముల కోసం పారిశ్రామిక వేత్తలు,పెద్ద కంపెనీల యజమానులు పోటాపోటీగా ప్రయత్నాలు ప్రారంభించారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు వందలు,వేల ఎకరాల భూములు సరిపోనందున లక్షల్లో సేకరించేందుకు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి అతి సునాయాసంగా భూముులు పొందగలుగుతున్నారు. పరిశ్రమలు,పెద్ద వాణిజ్య సంస్ఖల కోసం వాటి భూముల యజమానుల నుంచి నేరుగా భూములను కొనుక్కునే వారు.ఇప్పుడు వారికి ఆ శ్రమ అవసరం లేకుండా ప్రభుత్వాలే సేకరించి ఇస్తున్నాయి. సేకరణ కన్నా,సమీకరణ రైతులకు లాభం అని ఊదరగొడుుతున్నాయి. ఈ నేపధ్యంలో దాదాపు ఎనభై ఏళ్ళ క్రితం నాటి భూసేకరణ చట్టాన్ని పూర్వపు యూపీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్ళపాటు తాత్సారం చేసి చివరి సంవత్సరంలో సవరించింది.అది అమలులోకి రాకముందే, దాని స్థానే ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ని తెచ్చింది. భూసేకరణను సులభతరం చేయడం కోసమే ఈ ఆర్డినెన్స్‌ని తెచ్చామని బిజెపి నాయకులు పేర్కొంటుండగా, రైతులను మరింత ముంచేయడానికే కమలనాథులు ఈ ఆర్డినెన్స్‌ తెచ్చారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో దీని పూర్వాపరాలను పరిశీలిద్దాం....
భూసేకరణ విధానం పై గత డిసెంబర్‌ 31న రాష్ట్రపతి విడుదల చేసిన ఆర్డినెన్స్‌ పలు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. సామాజిక వర్గాల్లోనే కాక వ్యక్తుల్లో కూడా ఈ ఆర్డినెన్స్‌ పలు అనుమానాలను కలిగిస్తోంది. కనీస జీవనోపాధిని కూడా లేకుండా చేసి కాడెద్దులు ఎకరం నేల కలిగి జీవిస్తున్న కుటుంబాలు తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని నగరాలకు వలస వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయానికి ఈ ఆర్డినెన్స్‌ కారణమయ్యే ప్రమాదం ఉంది. 2013లో కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టానికి ఈ ఆర్డినెన్స్‌ ద్వారా పలు మార్పులు చేశారు. భూస్వామి అనుమతి అవసరం లేకుండానే పారిశ్రామిక కారిడార్లకు ప్రజాపనులకు భూమిని సేకరించే అధికారం ఇపుడు ప్రభుత్వానికి వుంది. పరిశ్రమలు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేసి కాంక్రీట్‌ అరణ్యాలుగా మార్చేయత్నం జరుగుతోందని పర్యావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. గ్రామీణ ప్రాథమిక వనరుల అభివృద్ధి గృహ నిర్మాణం లాంటి అవసరాల కోసం భూమిని సేకరిస్తారని ఈ ఆర్డినెన్స్‌ చెబుతోంది. ఇల్లుపీకి పందిరి వేస్తున్నట్టుగా సర్కారు ఆలోచనలు వున్నట్టు కనపడుతోంది. విస్తృత పరిధిలో చూస్తే అభివృద్ధి కోసమే భూమిని సేకరించినట్లు కనపడినా సూక్ష్మంగా పరిశీలిస్తే సగటు మానవుని హక్కును విఘాతం కలుగుతుందేమోనన్న అనుమానం కలగకపోదు. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించవచ్చు. కీలకమైన మరో మార్పు ఏమిటంటే ప్రైవేట్‌ పరిశ్రమలు ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు లాంటి అవసరాల కోసం సైతం కేంద్రం ఇప్పుడు భూసేకరణ చేయవచ్చు. ఇదొక ప్రమాదకరమైన నిర్ణయంగా మారే ప్రమాదం వుంది. 
ఏ స్థలం ఎప్పుడు పరస్వాధీనమవుతుందో తెలియదు. ఏ పంట పొలంలో ఏ భవన నిర్మాణం జరుగుతుందో రైతు ఊహించలేడు. విషయమేమంటే ఇలా సేకరించిన భూమిని ప్రైవేట్‌ సంస్థల అవసరాల కోసం కేటాయించే అవకాశం కొత్త చట్టంలో వుంది. ఇలా కేటాయించిన భూమిని వినియోగంలోకి తెచ్చేందుకు సదరు ప్రైవేట్‌ సంస్థలకు కాలపరిమితిని కూడా లేకుండా చేశారు. స్వంత దారుడి నుంచి లాక్కొని ఇంకెవరికో ఏదో సంస్థకో కేటాయించిన భూమి సద్వినియోగం అవుతుందో లేదో తెలియదు. భూస్వామికి ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాని కన్నా ఎక్కువ లాభాలతో ఆ భూమితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ చేయవచ్చు. కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ప్రైవేట్‌ రంగంలో ఆసుపత్రులు విశ్వవిద్యాలయాల అవసరాల కోసం కూడా కేంద్రం భూస్వాముల అంగీకారానికి అతీతంగా భూమిని సేకరించే వీలుంది. ఉదాహరణకు రంగయ్య అనే వ్యక్తికి తన గ్రామంలో వున్న ఐదు ఎకరాల భూమిపై ఏదేని పారిశ్రామిక సంస్థకాని ప్రైవేట్‌ పాఠశాల ఏర్పాటు చేయాలన్న వ్యక్తులకు కానీ కన్ను పడిందంటే ఈ సరికొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే సేకరించి సదరు సంస్థల పరం చేయవచ్చు. అయితే గతంలో లాగా కాక భూస్వామికి అత్యధిక నష్టపరిహారం చెల్లించే వెసులుబాటును ఈ ఆర్డినెన్స్‌ ద్వారా కల్పించారు. గత భూసేకరణ చట్టంలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ప్రైవేట్‌ హోటల్‌ నిర్మాణాలకు భూమిని సేకరించి కేటాయించే అధికారం కేంద్రానికి వుండేది కాదు. కాగా ఈ జనవరి మొదటి తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టంలో ప్రైవేట్‌ భాగస్వామ్యంలోని అన్ని నిర్మాణాల అవసరాలకూ కేంద్రం భూమిని సేకరించవచ్చు. సామాజిక ప్రాథమిక వనరుల అభివృద్ధి కోసం కూడా భూమిని సేకరించే అధికారం ఈ ఆర్డినెన్స్‌ కేంద్రానికి కట్టబెడుతోంది. పరిశ్రమలకు ఇతర ప్రైవేట్‌ సంస్థల ఏర్పాటు కోసం సేకరించిన భూమిని తక్షణమే వినియోగంలోకి తేవాలన్న నియమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంలో తొలగించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనా విధానంలో కొంత దార్శనీయకత వ్యక్తమవుతున్నా దేశంలోని భూములన్నింటిపై హక్కును తన హస్తగతం చేసుకోవడం పౌరులకు భూమిపై ఉన్న ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే అవుతుంది.
మనిషి తన హక్కుకు భంగం కల్గుతోందంటే విపరీతమైన భావోద్వేగానికి గురి అవుతాడు. 2006లో ఒడిషాలోని కాళీనగర్‌ భూసేకరణ సంఘటన పర్యావరణం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఒడిషా పారిశ్రామిక మౌలిక అవసరాల అభివృద్ధి సంస్థ (ఐడీసిఓ). టాటా స్టీల్‌ సంస్థ కాళీనగర్‌లో స్టీలు ఉత్పత్తి కోసం ఒడిషా ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ భూసేకరణ కోసం అధికారిక ప్రయత్నాలు ప్రారంభించగానే రైతులు వందలాదిగా ఏకమై భూమిని ఇవ్వడానికి నిరాకరించడమే గాక తీవ్రంగా నిరసించారు. దీనితో 2 జనవరి 2006లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది రైతులు ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నష్టపరిహారాన్ని పెద్దయెత్తున పెంచడంతో రైతులు శాంతించారు. పశ్చిమ బెంగాల్లోని సింగూర్‌లో సైతం 2008లో ఇలాంటి తీవ్ర సంఘటనే జరిగింది. నానో కార్ల ఉత్పత్తికోసం సింగూర్‌లోని స్థలాలను అప్పటి ప్రభుత్వం సేకరించి టాటా కంపెనీకి ధారాదత్తం చేసే విషయం తీవ్ర పరిణామాలకు దారితీసింది. 997 ఎకరాల బహుళ పంటల భూమిని టాటా కంపెనీకోసం సేకరించే ప్రభుత్వ ప్రయత్నాన్ని రైతులు సహజంగానే అంగీకరించలేదు. నష్టపరిహారం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినా రైతులు ఒప్పుకోలేదు. సేకరించదలచిన స్థలం ఎంతో సారవంతమైనదే కాక రైతుల జీవనోపాధికి అదే ఆధారం. సేవ్‌ సింగూర్‌ ఫామ్‌ లాండ్‌ (సింగూర్‌ వ్యవసాయ భూముల రక్షణ) సంఘం కూడా ఏర్పాటైంది. ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొన్నా నిరసనలు ఆగలేదు. ఆరుమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక దశలో రైతులకు నక్సలైట్ల సహకారం కూడా లభించింది. పరిస్థితి చేయిదాటి పోవడంతో టాటా కంపెనీ వెనక్కి తగ్గి సింగూర్‌లో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేసి అన్నీ సర్దుకుని వెళ్లిపోయింది. ఇలాంటి పరిణామాలు భూసేకరణ సందర్భంలో జరిగే ప్రమాదాలు వున్నాయి. కొన్ని రాజ్యాంగేతర వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి వెసులుబాటు కల్పించనుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే భూమిని కేటాయించిన అయిదు సంవత్సరాల తర్వాత కూడా ఆ భూమిని వినియోగించలేకపోతే సేకరించిన భూమిని తిరిగి భూస్వామికే తిరిగి ఇచ్చేందుకు 2103 చట్టంలో వీలు వుండేది. ప్రస్తుత చట్టంలో కాలపరిమితి లేదు. ఆర్డినెన్స్‌ ద్వారా తెచ్చిన ఈ చట్టాన్ని ఆరు నెలల్లో పార్లమెంటు ఉభయ సభలు అంగీకారం తెలపాల్సి వుంటుంది. గమనించాల్సిన మరో విషయమేమంటే ఈ కొత్త చట్టంలో ప్రైవేట్‌ కంపెనీ అనే పేరు స్థానంలో ప్రైవేట్‌ ఎంటిటీ (అస్థిత్వం) అని పేర్కొన్నారు. 
కొన్ని న్యాయపరమైన సమస్యలు రాకుండా ఇలాంటి పదాన్ని వాడారని తెలుస్తోంది. ప్రైవేట్‌ భాగస్వామ్య సంస్థలకు కార్పొరేట్‌ సంస్థలకు స్వచ్ఛంద సంస్థలకు ఈ చట్టం వల్ల మేలు చేయడానికి ఎంటిటీ అనే పదాన్ని ఉపయోగించారని అధికారవర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వివిధ అవసరాల కోసం భూసేకరణ పాత చట్టంలోని కొన్ని క్లిష్టమైన సెక్షన్ల వల్ల తీవ్రమైన జాప్యం జరుగుతోందని రాష్ట్ర సిఇవోలు ఒత్తిడి తేవడమే ఈ ఆర్డినెన్స్‌కు కారణమని అంటున్నారు. ఈ చట్టం నుంచి గిరిజన ప్రాంతాలను మినహాయించారు. దేశంలోని దాదాపు అన్ని రకాల భూములపై హక్కు ఈ చట్టంవల్ల బ్యూరోక్రాట్స్‌కి దక్కిందనే చెప్పవచ్చు. గిరిజన ప్రాంతాల్లో భూసేకరణకు ప్రభుత్వానికి ఆ ప్రాంతాల్లోని గ్రామసభల అంగీకారం అవసరం. అయితే గ్రామ సభలు కూడా రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే తీర్మానాలు చేస్తున్నాయనే వాదనలూ వున్నాయి. ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. చివరికి భారతదేశంలోని దాదాపు అన్ని భూములు కేంద్ర యాజమాన్యంలోకి పరోక్షంగా వచ్చినట్లే భావించాలి. నాణానికి ఒకవైపు నుంచే పరిశీలిస్తే రంధ్రాన్వేషణ కిందికే వస్తుంది. నాణానికి మరోవైపు నుంచి పరికిస్తే భూసేకరణ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రపంచం మొత్తం భారతదేశం వైపే ఆసక్తిగా చూస్తోందని ప్రధాని నరేంద్రమోడీ, రవాణా, ఎనర్జీ, నీరు, శుభ్రత, కమ్యూనికేషన్స్‌, సామాజిక వాణిజ్య ప్రాథమిక అవసర రంగాల అభివృద్ధికి భూసేకరణ అనివార్యం అవుతోంది. దీనితోపాటు విద్య, వైద్య, హోటల్‌, టూరిజం రంగాల అభివృద్ధి సైతం ప్రాధాన్యమైన అంశాలే. అందుకే ఈ రంగాల అభివృద్ధికోసం భూసేకరణ తప్పనిసరి అయిందని అధికార పార్టీలవారు చెబుతున్నారు.
భూమిపై హక్కుకు భారత రాజ్యాంగం రక్షణ కల్పించింది. అందునా వ్యవసాయ కమతాలను రక్షించాల్సిన కనీస బాధ్యత పాలకులకు వుంది. ఇక్కడ ఆలోచించాల్సిన కీలక అంశం ఏమిటంటే భారతదేశంలో కోటి 96 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేంద్ర గణాంక సంస్థ 2012లో ప్రకటించింది. మొత్తం దేశంలోని భూమి విస్తీర్ణంలో ఇది 46.1 శాతం, కోటి 4 లక్షలకు పైగా వ్యవసాయదారులు వ్యవసాయమే తమ జీవనోపాధఇగా జీవిస్తున్నారు. ఈ రంగాన్నే నమ్ముకొని కోటి 6 లక్షలకు పైగా వ్యవసాయ కూలీలు బ్రతుకుతున్నారు. 
వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాల ద్వారా జీవిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగానే వుంది. దీనికితోడు తలసరి వ్యవసాయ భూమి భారతదేశంలో 0.27 హెక్టార్లు మాత్రమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో సర్కారు వారి ఆర్డినెన్స్‌ వల్ల చిన్న, సన్నకారు రైతుల్లో వణుకు పుడుతోంది. వ్యవసాయం సక్రమంగా 'సాగు' తేనే తలసరి ఆహార ధాన్యం ప్రతి నెల 4.56 కిలోలు మాత్రమేనని గణాంక వివరాలు తెలుపుతున్నాయి. పారిశ్రామికంగా ఇతర రంగాల అభివృద్ధికోసం వ్యవసాయ భూములను సైతం ప్రభుత్వం సేకరించడం ప్రారంభిస్తే ఫలితాలు దారుణంగా పరిణమించవచ్చని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. చివరికి ఎందరో అన్నదాతలు పట్టణాలకు వలసలు వచ్చి దినసరి కూలీలుగా మారే ప్రమాదమూ వుంది.
నాలుగు పేజీల ఆర్డినెన్స్‌లో భూ స్వంతదారు అంగీకారం అవసరం లేదన్న కీలకాంశం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. బలవంతంగా భూమిని సేకరించడం వల్ల 6 కోట్ల ప్రజలు ఇప్పటికే తమ తమ ప్రాంతాలను విడచి వలసలు వెళ్లారు. ఇందులో నిరుపేదల సంఖ్యే అధికం, దళితులకు గిరిజనులకు మేలు చేయాలన్న ప్రాథమిక సూత్రం భూసేకరణ వల్ల నీరుగారి పోతోంది. గతంలో కూడా భూసేకరణ అధికారం ప్రభుత్వానిదే అయినా ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛవల్ల భూసేకరణ అంత సులువుగా కొనసాగలేదు. ప్రజాపోరాటాలకి చాలాసార్లు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
అయితే ప్రైవేట్‌ వ్యాపార సంస్థల ఒత్తిడికి కేంద్రం తలొగ్గక తప్పలేదు. ప్రైవేట్‌ రంగంలో ఎలాంటి వాణిజ్యాత్మక నిర్మాణానికైనా కేంద్ర భూమిని సేకరించి మరీ కట్టబెట్టే అవకాశాలు ఈ ఆర్డినెన్స్‌ ద్వారా పెరిగాయి. మరో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వం భూమిని సేకరించి నష్టపరిహారాన్ని చెల్లించిన వెంటనే సదరు భూమికి హక్కుదారు ప్రభుత్వమే అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి క్లెయిములకైనా చట్టబద్ధత వుండదు. గతంలో రాచరిక వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు వుండేవి. తన పాలనలోని భూములన్నింటికీ రాజీ స్వంతదారుడుగా వుండేవాడు. ఏ క్షణాన్నైనా రాజుకు ఎవరి భూమినైనా తన స్వాధీనంలోకి తెచ్చుకునే అవకాశం వుండేది. ఈ ఆర్డినెన్స్‌ దాదాపు అలాంటి హక్కు భూక్తాలనే ప్రభుత్వానికి కల్పిస్తున్నట్లు వుంది. ఇదిలా వుంటే పారిశ్రామిక కారిడార్ల కోసం భూసేకరణ అనే పదంలో కొంత అయోమయం వ్యక్తమవుతోంది. నిజానికి పారిశ్రామిక కారిడార్‌ అనే పదానికి సరియైన నిర్వచనమే లేదు. ముంబయి -ఢిల్లీ పారిశ్రామిక ప్రాజెక్టును పరిశీలిస్తే ఈ నిజం తెలుస్తుంది.1483 కిలోమీటర్ల రైల్‌ రవాణా సుంకం (ఫ్రైట్‌) కారిడార్‌ వ్యవస్థ ఎన్నో అనర్దాలను సృష్టిస్తోంది. ఈ కారిడార్‌కు ఇరువైపులా 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త నగరాలు ఐటి పార్కులు పారిశ్రామిక జోన్లు మెగా పవర్‌ ప్లాంట్లు ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతాలు పోర్టులు ఫుడ్‌, ఆగ్రో పార్కులు అంతర్గత టౌన్లు కార్గో హబ్బులు, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు... ఇలా ఒక కొత్త ప్రపంచానికే ప్రణాళికలు వేశారు. అయితే పారిశ్రామిక కారిడార్‌ అనే పదానికి నిర్వచనం లేదు కనుక కోర్టు ఈ పదాన్ని నిర్వచించే దాకా ఈ ప్రాజెక్టుకు భూమి సేకరణ అభ్యంతరకరంగా మారింది. ఇలాంటి న్యాయపరమైన అంశాలు కొన్ని కేంద్రానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
ఇదిలా వుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణ విధానం కేంద్రం తెచ్చిన 2014 భూసేకరణ విధానానికి భిన్నంగా వుంది. ఒక సరికొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు. కృష్ణానదీ తీరానికి దగ్గర్లోని 3,600 ఎకరాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. విచిత్రమేమంటే కేంద్రం ప్రకటించిన భూసేకరణ చట్టం ప్రకారం సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్వచ్ఛందంగానే స్వీకరించి సేకరించిన భూమికి నిర్ణయించిన నిష్పత్తిలో కొంతభాగాన్ని భూస్వామికి కేటాయిస్తారు. సదరు భూమిని అభివృద్ధి చేసి తిరిగి భూస్వామికి ఇస్తారు. దీనితో భూస్వామి సహజంగానే పెరిగిన ధరతో భూమిని విక్రయించుకొని లాభాలను సంపాదించే అవకాశం వుంది. ఇదేకాక భూస్వామి స్టాంపు డ్యూటీని రిజిస్ట్రేషన్‌ పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొందరు ఈ విధానం కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా వుందని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు తన స్వంత ఆలోచనలతో చట్టాలను ఉల్లంఘిస్తూ భూస్వాములకు రక్షణ కల్పించడంలో విఫలమౌతున్నారని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని కోసం చేస్తున్న భూమి సేకరణను భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) అని పేరుపెట్టుకున్నారు. అయితే ఇదొక ముందు చూపులేని కార్యక్రమంగా మేధావులు పలు పార్టీలకు చెందినవారు పేర్కొన్నారు. మాజీ హైకోర్టు జడ్జి పి.లక్ష్మణ్‌ రెడ్డి ఈ వ్యవహారం చట్టబద్ధమైంది కాదని అన్నారు. వ్యవసాయ భూములను ఏ పేరుతో సేకరించినా అది తీవ్రపరిణామాలకు దారితీస్తుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాయి. 
మాజీమంత్రి శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ భూములను పట్టణ నిర్మాణానికి సేకరించడంలో ఔచిత్యం లేకపోగా రైతుల జీవనోపాధికి విఘాతం కల్పిస్తుందని అన్నారు. కొందరు రైతులు తమ జీవనోపాధితో రాజకీయాలు సాగిస్తే చరిత్ర పునరావృతమవుతుందని హెచ్చరించడం గమనార్హం. ఏది ఏమైనా కొత్త భూసేకరణ చట్టం సర్కారు ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. ప్రజల అభిప్రాయం సేకరించకుండానే వాళ్ల కనీస హక్కులను హరించే ప్రయత్నం ఎలాంటి ఫలితాల నిస్తుందో వేచిచూడాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి