18, ఫిబ్రవరి 2015, బుధవారం

బెయిల్‌ సొమ్ముకే దిక్కులేదు.. డిపాజిట్లెలా చెల్లిస్తారు?

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా జైలు జీవితం గడుపుతున్న సుబ్రతా రాయ్‌ బెయిల్‌ కోసం తాము సూచించిన విధంగా పది వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకే నానా తంటా లు పడుతున్న సహారా, ఆయన బెయిల్‌పై బయటికి వచ్చాక డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఎలా చెల్లించగలదని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. బెయిల్‌ కోసం ఆస్తుల అమ్మకానికి సంబంధించి కొనుగోలుదారులతో మాట్లాడేందుకు సుబ్రతా రాయ్‌కు తీహార్‌ జైల్లో ప్రస్తుతం కల్పిస్తున్న వసతులను మరో 4- 6 వారాలు పొడిగించాలని సహారా గ్రూప్‌ సుప్రీంకోర్టును కోరింది. ఈ సందర్భంగా బెయిల్‌ కోసం సహారా ఏ విధంగా నిధులు సమీకరిస్తుంది, అనంతరం డిపాజిటర్లకు ఎలా సొమ్ములు చెల్లిస్తుందని సుప్రీం కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ‘మీరు కేవలం పది వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకే నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటప్పుడు జైలు నుంచి బయటకి వచ్చాక 30 వేల కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తారు’ అని జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్‌ సహారా న్యాయవాదులను ప్రశ్నించింది. వసతుల పొడిగింపునకు సంబంధించి సరైన దరఖాస్తును సమర్పించాలని న్యాయవాదులకు బెంచ్‌ సూచించింది. ఆస్తుల విక్రయానికి సంబంధించి ఇతరత్రా మార్గాలను సూచించాలని ఈ కేసులో అమికస్‌ క్యురిగా వ్యవహరిస్తున్న శేఖర్‌ నఫాడెను బెంచ్‌ కోరింది. ఈ విక్రయాల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బిఎన్‌ అగర్వాల్‌ సేవలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతకుముందు సుబ్రతా కోసం అమెరికాకు చెందిన మిరాక్‌ క్యాపిటల్‌ గ్రూప్‌తో పదివేల కోట్ల రూపాయల రుణ సేకరణ యత్నాలు విఫలమయ్యాయని సహారా సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం మరో మూడు ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని, వీటిలో డచ్‌ కంపెనీతో డీల్‌ కుదురుతుందని ఆశలు ఉన్నట్లు సహరా కోర్టుకు తెలిపింది. అంతేకాక తమ ఆంబీ వ్యాలీ ప్రాజెక్టు కోసం మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. సహారా కోరుతున్నట్లు వసతుల పొడిగింపునకు సంబంధించి వారంలో కోర్టు అనుమతి ఇవ్వవచ్చని న్యాయవాదుల్లో ఒకరు చెప్పారు.
మమ్మల్ని కూడా చేర్చుకోండి: ఆర్‌బిఐ
ఈ కేసులో తమను కూడా పార్టీగా చేర్చుకోవాలని తాజాగా ఆర్‌బిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయ్‌ విడుదల కోసం ఆస్తులు అమ్మకుండా సహారాకు చెందిన సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఎ్‌సఐఎ్‌ఫసిఎల్‌)ను నిరోధించాలని ఆర్‌బిఐ.. సుప్రీంకోర్టును కోరింది. ఈ సంస్థ ఆర్‌ఎన్‌బిసి అని, తమ నియంత్రణలో ఉంటుందని అందువల్ల సెబికి నిధులు చెల్లించేందుకు సంస్థ ఆస్తులను వినియోగించకుండా చూడాలని కోరింది. ఒకవేళ ఉమ్మడి అకౌంట్‌లో ఎస్‌ఐఎ్‌ఫసిఎల్‌ ఆస్తులను అమ్మడం ద్వారా ఏదైనా సొత్తు జమై ఉంటే, దాన్ని ఎస్ర్కో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయాలని కోరింది.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆస్తులు, సంవత్సరాల తరబడి భారత క్రికెట్‌ టీమ్‌కు స్పాన్సర్‌షిప్‌, క్రికెటర్లకు లగ్జరీ బంగ్లాలు కానుకగా ఇచ్చిన గతం. ఎన్నో స్పోర్ట్స్‌ టీమ్‌లకు అధినాయకత్వం. దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌... ఇన్ని ఉన్న ఒక వ్యక్తి బెయిల్‌ కోసం పది వేల కోట్ల రూపాయలు కూడబెట్టలేక ఏడాది కాలంగా జైల్లో ఉంటున్నాడంటే అసలు ఈయన ఆస్తులు నిజమైనవేనా? అని ఎవరికైనా అనుమానం వస్తుంది. సహారా అధిపతిపై సుప్రీం కోర్టుకు సైతం ఇదే అనుమానం వచ్చింది. నిజానికి సంస్థ ఆస్తుల్లో చాలా భాగం బినామీలవని, వాటిని విక్రయించేందుకు సదరు పెద్దలు ఒప్పుకోవడంలేదని అంతర్గత సమాచారం. సెబి సైతం ఇవే భయాలను వ్యక్తం చేస్తోంది. ఇదే నిజమైతే ఇలాంటి ఇంటిదొంగల గుట్టు రట్టు చేయలేకపోతున్న ప్రభుత్వం, పరిశోధక సంస్థలు విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించగలవా? ఇంకో ఏడాదికైనా సుబ్రతా రాయ్‌ బయటకి వస్తాడా? వచ్చినా డిపాజిటర్లకు సొమ్ములు వెనక్కి ఇస్తాడా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి