|
స్పైస్‌జెట్, దక్కన్ క్రానికల్, కింగ్‌ఫిషర్, సహారా... ఈ నాలుగు కంపెనీలకు పోలికలేంటో చెప్పుకోండి? ఒక్కోటి ఒక్కో రకం కంపెనీ, వీటికి పోలికలేముంటాయనుకుంటున్నారా? ఉందండీ బాబు... ఎయిర్‌లైన్స్, క్రికెట్ టీమ్‌ల కారణంగా తలబొప్పి కట్టడమే వీటి మధ్య పోలిక. ఎలాగంటారా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. నాలుగు కంపెనీలు ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టినవే... అయితే విమానం క్రాషయినట్లే నాలుగు కంపెనీలు చేతులెత్తేసి చివరకు బొక్కబోర్లాపడ్డాయి. సుబ్రతో రాయ్‌కు చెందిన సహారా విమానాలు నడపలేక వేరే కంపెనీకి అమ్ముకంటే, దక్కన్ క్రానికల్ (డిసి) అధిపతి సైతం ఎయిర్‌లైన్స్ కోసం దక్కన్ ఏవియేషన్ ఏర్పాటు చేసి చివరకు ఒక్కవిమానం కొనకుండానే దుకాణం మూసుకున్నారు. స్పైస్‌జెట్ ముక్కుతూ మూల్గుతూ బండి నెట్టుకొస్తోంది. తాజాగా పగ్గాలు మారన్ చేతి నుంచి చేజారిపోయాయి. ఇక విలాస పురుషుడు విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ కంపెనీకి అప్పులిచ్చిన పాపానికి బ్యాంకులు, ఇందులో పనిచేసిన పాపానికి సిబ్బంది లబోదిబోమంటున్నారు. ఇక ఈ నాలుగింటి మధ్య మరో పోలిక.. ఐపిఎల్ టీమ్‌ల కొనుగోలు. ఐపిఎల్‌లో దక్కన్ చార్జర్స్‌ను కొన్న డిసి మొదట్లో కాస్త లాభాలను చవిచూసినా.. తర్వాత ఏకంగా టీమ్‌నే కోల్పోయింది. అలాగే సహారా ఇండియా అట్టహాసంగా కొనుగోలు చేసిన పుణె వారియర్స్ చివరకు సోదిలో లేకుండా పోయింది. కింగ్‌ఫిషర్ సైతం ఐపిఎల్‌కు చెందిన రాయల్ ఛాలెంజర్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. స్పైస్‌జెట్ ప్రస్తుతం దక్కన్ ఛార్జర్స్‌ను సొంతం చేసుకుంది. సహారా, మారన్ కాకుండా మిగిలిన రెండు కంపెనీల అధిపతుల మధ్య మరో పోలిక కూడా ఉందండోయ్... అదే రాజకీయాలు.. డిసి అధినేత వెంకట్రామిరెడ్డి, విజయ్ మాల్యా పార్లమెంట్ సభ్యులుగా కొంతకాలం ఉన్నారు. సుబ్రతో ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా, పరిచయాలకు మాత్రం కొదవ లేదు. అయితే పరిస్థితులు తారుమారైన క్రమంలో వీరి రాజకీయ నేపథ్యం అంతగా అక్కరకు రాకుండా పోయింది. విజయ్ మాల్యా, సహారా సుబ్రతో కాక మిగిలిన ఇద్దరికీ ఒక పోలిక ఉంది. అదే మీడియాలో పెట్టుబడులు. దక్కన్ క్రానికల్‌కు వెంకట్రామి రెడ్డి అధిపతి కాగా సన్ నెట్‌వర్క్‌కు మారన్ అధిపతి. సుబ్రతో తప్ప మిగిలిన వారి వల్ల బ్యాంకులు మాత్రం కుప్పలుతెప్పలుగా ఎన్‌పిఎలు పోగేసుకొని నానా బాధలు పడుతున్నాయి. తాజాగా సుబ్రతో, వెంకట్రామిరెడ్డిల మధ్య ఒక పోలిక పోల్చవచ్చు. అదేనండి.. ఇద్దరూ అరెస్టయి ఊచలు లెక్కపెట్టడం. ఇక వీరితో జాయినయ్యేది ఎవరో చూడాలి.
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి