|
అల్లాడి పోతున్న బ్యాంకులు
ఎడాపెడా పెరిగి పోతున్న మొండి బకాయి (ఎన్‌పిఎ)లు దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని కుంగదీస్తున్నాయి. 2014 డిసెంబర్ నాటికి స్టాక్ మార్కెట్లో లిస్టయిన బ్యాంకుల ఎన్‌పిఎలు రూ.4.85 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో రూ.51,252 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో వచ్చి చేరటం గమనార్హం. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సైతం బ్యాంకులకు రావలసిన బకాయిల్లో రూ.24,000 కోట్లు మొండి పద్దులుగా తేలాయి. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)ల వాటా రూ.21,000 కోట్లు. మూడో త్రైమాసికంలో ఎస్‌బిఐ మొండి బకాయిలు కొద్ది స్థాయిలోనే పెరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మాత్రం ఎస్‌బిఐ మొండి బకాయిలు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గటం విశేషం. ఊహించిన దానికంటే ఎక్కువే.. డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను బ్యాంకుల మొండి బకాయిలు, ఊహించిన దానికంటే ఎక్కువగానే పెరిగాయి. మార్చితో ముగిసే నాలుగో త్రైమాసికంలో కూడా పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, వస్త్ర పరిశ్రమ, ఇనుము-స్టీలు రంగాలకు చెందిన కంపెనీలు ఇంకా ఆర్థిక కష్టాల నుంచి బయట పడలేదు. రుణ పునర్ వ్యవస్థీకరణ (సిడిఆర్) చేపట్టినా ఈ రంగాలకు చెందిన చాలా కంపెనీల అప్పుల చెల్లింపు అంతంత మాత్రంగానే ఉంది. మొండి బకాయిలు ఇలా ఎడాపెడా పెరిగి పోవడంతో బ్యాంకుల లాభాలు, మూలధనానికి చిల్లు పడుతోంది. మార్చి దగ్గర పడుతుండడంతో బ్యాంకులన్నీ ఇపుడు ఈ మొండి బకాయిల కోసం కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పిఎస్‌యుబ్యాంకులతో పాటు దేశీ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు అంతంత మాత్రంగానే ఉంటాయని బ్యాంకింగ్ వర్గాలంటున్నాయి. మరో ఆర్నెళ్ల వరకు రుణాల వసూళ్లు పెద్దగా పెరిగే అవకాశం లేదని కూడా మార్కెట్ వర్గాల అంచనా. అయితే ఎన్‌పిఎ వసూళ్లలో ప్రైవేట్ బ్యాంకుల పరిస్థితి కొంతవరకు మెరుగ్గానే ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. జాబితాల్లో బడాబాబులు.. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా, దక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి లాంటి వారి జోలికి వెళ్లేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయి. అపుడప్పుడు కొద్దిగా హడావుడి చేసినా, తర్వాత మళ్లీ చప్పుడు చేయడం లేదు. మహా అయితే ‘డీఫాల్టర్’గా ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయి. దీంతో కొన్నిచోట్ల ఆయా బ్యాంకుల ఉద్యోగులే ఈ ఘరానా పెద్ద మనుషుల ఇళ్ల ముందు ధర్నాలకు దిగుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా బ్యాంకు సిబ్బంది ఇలానే ధర్నాలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంత కష్టపడ్డా ఆ బడాబాబుల నుంచి రావాల్సిన బకాయిలు మాత్రం వసూలు కాలేదు. |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి